Leading News Portal in Telugu

IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్


  • డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 మెగా వేలం
  • అందరి చూపు డుప్లెసిస్‌పైనే
  • మ్యాక్స్‌వెల్‌ దండగ అంటున్న ఆకాశ్
IPL 2025-RCB: అతడిని జట్టులోకి తీసుకోవడం దండగ: మాజీ క్రికెటర్

Aakash Chopra About RCB Retention for IPL 2025: ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌కు సంబంధించి ఇటీవల బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య భేటీ జరగగా.. భారత క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రిటెన్షన్‌, రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలి?, ఎవరిని వేలంలోని వదిలేయాలనే దానిపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో తాజాగా భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆర్‌సీబీ రిటెన్షన్‌ విధానంపై స్పందించాడు.

కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ పక్కన పెట్టడం ఖాయం అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవడం దండగ అని అభిప్రాయపడ్డాడు. ‘కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకుంటుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రిటైన్‌ చేసుకోదని నేను అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ తప్పకుండా జట్టులో ఉంటాడు. మహ్మద్ సిరాజ్‌ను రిటైన్‌ చేసుకుంటుంది. భారత బౌలర్‌గా అతడికి పక్కాగా అవకాశం ఉంటుంది’ అని ఆకాశ్ చెప్పాడు.

‘ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్‌ బౌలర్లు ఉండకపోవచ్చు. నాకే అవకాశం ఉంటే కామెరూన్ గ్రీన్‌తో పాటు రజత్‌ పటీదార్‌ను తీసుకుంటా. గత ఏడాది దారుణంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవడం దండగ. అతడిని తీసుకోవద్దని ఆర్‌సీబీకి సలహా ఇస్తున్నా. మ్యాక్స్‌వెల్‌ కంటే విల్ జాక్స్‌ చాలా బెటర్. రిటైన్‌ నిబంధనలు వచ్చాక ఈ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, హ్మద్ సిరాజ్‌, కామెరూన్ గ్రీన్‌, రజత్‌ పటీదార్‌ సహా విల్ జాక్స్‌ను రిటైన్‌ చేసుకోవాలని ఆకాశ్ సూచిస్తున్నాడు.