Leading News Portal in Telugu

Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..


  • అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి

  • భారత్‌ తరఫున 10వ బౌలర్‌గా నిలిచిన బుమ్రా.
Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..

బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్‌ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.

హసన్ మహమూద్ ఔట్‌ చేసి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. 11 ఓవర్లలో 50 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి ఓవర్‌లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్‌ను బుమ్రా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ వికెట్లు తీశాడు.

కపిల్‌-జహీర్‌ల జాబితాలో చేరిన బుమ్రా:
అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన తర్వాత.. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ వంటి ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చేరాడు. బుమ్రా తన 227వ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన ఫీట్‌ను పూర్తి చేశాడు.

2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా:
బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా.. మొదట పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఉన్నాడు. త్వరలోనే టెస్ట్ క్రికెట్‌లో భారతదేశానికి ముఖ్యమైన బౌలర్‌గా ఎదిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో బుమ్రా 19 వికెట్లు పడగొట్టాడు.