Leading News Portal in Telugu

Shikhar Dhawan Retirement: అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికా: ధావన్‌


  • అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్‌ వీడ్కోలు
  • దేశవాళీ క్రికెట్‌ ఆడాలనుకోలేదు
  • ప్రపంచకప్‌ గెలిస్తే బాగుండేది
Shikhar Dhawan Retirement: అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికా: ధావన్‌

Shikhar Dhawan About Retirement: శిఖర్ ధావన్ కంటే ముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు భారత జట్టులో కొనాగుతున్నారు. ఇషాంత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి వారు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. రిటైర్డ్ భారత క్రికెటర్స్ ఎంఎస్ ధోనీ, పీయూష్ చావ్లా, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఇంకా ఆడుతున్నారు. ఫిట్‌గా, మంచి ఫామ్‌లో ఉన్న ధావన్ మాత్రం.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ఎందుకు పలకాల్సి వచ్చిందో చెప్పాడు.

భారత జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్లో ఆడే ఆసక్తి లేకపోవడం వల్లే రిటైరయ్యానని శిఖర్‌ ధావన్‌ తెలిపాడు. ఓ జాతీయ మీడియాతో గబ్బర్ మాట్లాడుతూ… ‘నేను దేశవాళీ క్రికెట్‌ ఆడాలనుకోలేదు. అందులో ఆడాలనే ఉత్తేజం, ఆసక్తి నాలో లేదు. నా కెరీర్‌ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడాను. చివరి రెండేళ్లలో నేను క్రికెట్ ఆడింది తక్కువే. చాలా క్రికెట్ ఆడాననుకున్నా. నాకు విరామం కావాలనిపించింది. ఎక్కువగా క్రికెట్‌ ఆడకపోవడంతో అంతగా ఫామ్‌లో కూడా లేను. నేను సంతోషంగా ఉన్నా. కెరీర్‌లో సాధించిన దాని పట్ల సంతృప్తి చెందా. ప్రపంచకప్‌ గెలిస్తే బాగుండేది’ అని అన్నాడు.

టీమిండియా ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ ధనాధన్‌ మెరుపులు మెరిపించాడు. కెరీర్‌లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లోనూ గబ్బర్ రాణించాడు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 222 మ్యాచ్‌లు ఆడి 6769 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 51 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ)లో ఆడుతున్నాడు.