Leading News Portal in Telugu

Preity Zinta Dream: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్!


  • సీపీఎల్ 2024 ఫైనల్లో సెయింట్ లూసియా విజయం
  • సీపీఎల్‌లో ఇదే తొలి టైటిల్
  • నెరవేరిన ప్రీతీ జింటా కల
Preity Zinta Dream: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్!

Preity Zinta Dream Comes True: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ట్రోఫీ గెలవని జట్లలో ‘పంజాబ్‌ కింగ్స్‌’ టీమ్ కూడా ఒకటి. ట్రోఫీ సంగతి పక్కనపెడితే.. గత 17 సీజన్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మధ్యలో పేరు మార్చుకున్నా (కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌) ప్రయోజనం లేకపోయింది. దాంతో బాలీవుడ్ నటి, పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింటా టైటిల్ కల అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రీతీ కప్ కల నెరవేరింది. అయితే అది ఐపీఎల్‌లో కాదు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో.

ఆదివారం గయానాలో జరిగిన సీపీఎల్ 2024 ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌పై సెయింట్ లూసియా కింగ్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (25; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షై హోప్ (22; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సెయింట్ లూసియా 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆరోన్ జోన్స్ (48 నాటౌట్; 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (39 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు.

సీపీఎల్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఫ్రాంచైజీకి ఇదే తొలి టైటిల్. 2013లో సీపీఎల్‌లో అడుగుపెట్టిన సెయింట్ లూసియా.. ఎట్టకేలకు ట్రోఫీ సాధించింది. దాంతో బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ఆమె సందడి చేశారు. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నెస్ వాడియా, మోహిత్ బుమ్రాన్, కరన్ పాల్ కూడా సెయింట్ లూసియా ప్రాంచైజీకి యజమానులే. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కూడా కప్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.