Leading News Portal in Telugu

CM Chandrababu: ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?


  • అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్‌ 4
  • మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం
  • చంద్రబాబు-బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణ
CM Chandrababu: ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 25 నుంచి అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుపై షూట్ పూర్తి కాగా.. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది.

5 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న ప్రోమోలో బావా బామ్మర్దులైన చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాజకీయం నుంచి.. వ్యక్తిగత వరకు బాలయ్య బాబు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో బదులిచ్చారు. ఈ క్రమంలోనే బాబు తనకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు. ప్రముఖుల ఫోటోలను స్క్రీన్‌పై చూపిస్తూ.. వీరిలో ఎవరు ఇష్టం అంటూ బాలయ్య.. చంద్రబాబుని ప్రశ్నించారు. ఎంఎస్ ధోనీ, కోహ్లీ ఫోటోలను చూపిస్తూ.. ‘బావ మీరేమో ధోనీ లాంటి లీడర్.. నేనేమో కోహ్లీ లాంటి ఆటగాడిని’ అని అన్నారు. ‘నేను ఎప్పుడూ కోహ్లీని ఇష్టపడుతాను’ అని బాబు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.