Leading News Portal in Telugu

India WTC 2024 Scenario: India WTC final hopes are lost


  • వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు
  • రెండు టెస్టుల్లోనూ ఓడడంతో ఫైనల్‌ అవకాశాలపై ప్రభావం
  • చివరి టెస్టులో గెలవడం భారత్‌కు అత్యవసరం
WTC 2024-25: మూడో టెస్టులోనూ ఓడితే.. ఫైనల్‌ ఆశలు గల్లంతయినట్లే!

ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లోనూ భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరిన భారత్.. మూడోసారి కూడా ఆ దిశగా దూసుకెళ్లింది. అయితే భారత్‌కు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ చేతిలో ఓడడంతో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపింది. అంతేకాదు ఫైనల్‌ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి.

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు 73 గెలుపు శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. గెలుపు శాతంలో మిగతా జట్లకు అందని స్థాయికి దూసుకెళ్లింది. అయితే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓడిన తర్వాత కూడా టీమిండియా నంబర్‌ వన్‌గానే ఉంది. కానీ గెలుపు శాతం 62.82కి పడిపోయింది. ముంబైలో శుక్రవారం నుంచి జరిగే మూడో టెస్టులోనూ ఓడితే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు గల్లంతయినట్లే. అగ్రస్థానం కోల్పోవడమే కాదు.. పట్టికలో కిందికి పడిపోనుంది.

వచ్చే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని ఐదు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరే పరిస్థితి ఉంటుంది. కంగారో గడ్డపై అన్ని విజయాలు సులువు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు వరుస విజయాలు సాధిస్తున్న దక్షిణాఫ్రికా.. రోహిత్ సేనకు గట్టి పోటీ దారుగా ఉంటుంది. అందుకే ముందు కివీస్‌పై చివరి టెస్టులో గెలవడం భారత్‌కు అత్యవసరం. అప్పుడు ఆస్ట్రేలియాలో 3-2తో గెలిచినా అవకాశాలు ఉంటాయి.