Leading News Portal in Telugu

BCCI to discuss New Zealand whitewash.. Some Star Seniors Could Be Phased Out Post Australia series


  • న్యూజిలాండ్ చేతిలో 0-3తో భారత్ ఘోర పరాజయం..

  • ఆసీస్ పర్యటన తర్వాత నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు..

  • యంగ్ ప్లేయర్స్కు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న బీసీసీఐ..
Team India: ఆ నలుగురిలో ఇద్దరికి ఆసీస్‌ పర్యటనే చివరిది..?

Team India: న్యూజిలాండ్‌ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్‌ పిచ్‌లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లలో కనీసం ఇద్దరికి ఆసీస్‌ పర్యటనే ఆఖరిది కావొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చక్రంలో ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీనే లాస్ట్ ది.

కాగా, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొత్త ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చక్రం స్టార్ట్ అవుతుంది. కివీస్‌ చేతిలో తాజా పరాజయం తర్వాత బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన డబ్ల్యూటీసీ చక్రం కోసం టీమిండియా జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం చీఫ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్, సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్, బీసీసీఐ పెద్దల మధ్య అనధికారంగా చర్చ కొనసాగుతున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నారు. ఇది ఘోర పరాజయం.. దీనిపై కచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

అయితే, ఈనెల 10న ఆసీస్‌కు భారత జట్టు బయల్దేరనుంది. ఇప్పటికే జట్టును ప్రకటించడంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించకపోతే కొంతమంది సీనియర్లపై వేటు పడొచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు నలుగురు సీనియర్లను ఎంపిక చేయకపోవచ్చు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. బహుశా సొంతగడ్డపై నలుగురు సీనియర్లు కలిసి ఆడిన చివరి టెస్టు ఇదే కావొచ్చని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ లాంటి ప్లేయర్స్ సెలక్టర్ల దృష్టిలో ఉన్నట్లు సమాచారం.