Leading News Portal in Telugu

peru-footballer-dies-on-field-light-lightning-strike-injured-watch-video-viral – NTV Telugu


  • పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం

  • మ్యాచ్ జరుగుతుండగా భారీ వర్షం

  • ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా పిడుగు పాటు

  • 39 ఏళ్ల జోస్ హోగో డి లా క్రూజ్ మెజా అక్కడికక్కడే మృతి.
Tragedy: పిడుగుపాటుకు మైదానంలో ఆటగాడు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు(వీడియో)

మనం ఫుట్‌బాల్ మైదానంలో ఎన్నో అద్భుతమైన షాట్లు, గోల్స్ చూసి ఉంటాం. ఎంతో మంది ఆటగాళ్ల సత్తా కనపడుతుంది. అయితే పెరూలో జరిగిన ఈ బాధాకరమైన దుర్ఘటన మనం ఇంతకుముందు ఎక్కడ చూసి ఉండలేదు. ఆకాశం నుంచి వచ్చిన మెరుపు ఓ క్రీడాకారుడి ప్రాణం తీసింది. పెరూలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలాకాలో రెండు దేశీయ క్లబ్‌లు జువెటాడ్ బెల్లావిస్టా-ఫామిలియా చోకా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం జరుగుతుండగా, భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో.. రిఫరీ ఆటను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. ఆటగాళ్లు మైదానం నుండి వెళ్లిపోతుండగా.. పిడుగు పడింది.

దీంతో.. వెంటనే ఐదుగురు ఆటగాళ్లు నేలపై పడిపోయారు. పిడుగుపాటుకు 39 ఏళ్ల జోస్ హోగో డి లా క్రూజ్ మెజా అక్కడికక్కడే మృతి చెందాడు. గోల్‌కీపర్ జువాన్ చోకా (40) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో విచారాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలో 35 ఏళ్ల ఆటగాడు పిడుగుపాటుతో మృతి చెందాడు.