Leading News Portal in Telugu

SA vs IND: Arshdeep Singh 10 Wickets Away To Take Most T20 Wickets for India


  • నవంబర్ 8న మొదటి టీ20
  • ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్
  • బెస్ట్ కెరీర్ గణాంకాలు 4/9
Arshdeep Singh Record: ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్.. ‘ఒకే ఒక్కడు’ అవుతాడు!

దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 8న డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌ చేస్తోంది. సూర్యకుమార్‌ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రొటీస్ గడ్డపై టీ20 సిరీస్‌ గెలవాలని చూస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ప్రస్తుతం వెటరన్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉంది. 2022లో 32 మ్యాచ్‌లు ఆడిన భువీ.. 37 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 14 మ్యాచ్‌లే ఆడిన అర్ష్‌దీప్.. 28 వికెట్లు పడగొట్టాడు. మరో 10 వికెట్స్ పడగొడితే భువనేశ్వర్‌ను అర్ష్‌దీప్ అధిగమించి ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పుతాడు.

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ 10 వికెట్లు పడగొడితే.. భారత్‌ తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మరో రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ జాబితాలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 80 టీ20 మ్యాచ్‌లలో 96 వికెట్స్ తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 6/25. 56 టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ 87 వికెట్స్ తీశాడు. బెస్ట్ కెరీర్ గణాంకాలు 4/9.