-
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా-భారత్ సిరీస్ - క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
- రోహిత్ కెప్టెన్సీ కూడా దారుణంగా ఉంది
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులూ ఓడిపోయి భారత్ తీవ్ర పరాభవంను మూటగట్టుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. రెండు టెస్టుల్లో ఓటమితో పాఠాలు నేర్వని రోహిత్ సేన.. మూడో టెస్టులో సైతం ఓడడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఓటమికి బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక రోహిత్ గురించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా, భారత్ సిరీస్‌లో రోహిత్ శర్మ విఫలమైతే.. ఆ సిరీస్‌లో చివరి మ్యాచే హిట్‌మ్యాన్‌కు ఆఖరి టెస్టు అవుతుందని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ‘ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ రాణించలేకపోతే రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. తర్వాత వన్డేల్లో మాత్రమే అతడు ఆడనున్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. రోహిత్‌కి వయసు పెరిగిందన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో సిరీస్ మొత్తంలో రోహిత్ పేలవంగా ఆడాడు. కెప్టెన్సీ కూడా దారుణంగా ఉంది. రోహిత్ దీనిని అంగీకరించడం చాలా పెద్ద విషయం. ఇది ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెనర్‌ను సిద్ధం చేసుకోవాలి’ అని క్రిష్ణమాచారి బీసీసీఐకి సూచనలు చేశాడు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ 15.50 సగటుతో 93 పరుగులే చేశాడు. మరోవైపు రోహిత్ 15.16 సగటుతో 91 పరుగులే చేశాడు. దాంతో ఈ ఇద్దరు సీనియర్స్ క్రికెటర్ల రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. 36 ఏళ్ల విరాట్, 37 ఏళ్ల రోహిత్ త్వరలోనే ఆటకు వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్న ఈ ఇద్దరు.. త్వరలో టెస్టుల నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ ఆరంభం కానుంది.