Leading News Portal in Telugu

ICC Test Rankings: Virat Kohli leaves top 20 after 10 years


  • ఒకప్పుడు అలవోకగా సెంచరీలు
  • ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు
  • టాప్‌-20 నుంచి కూడా ఔట్‌
  • పదేళ్లలో ఇదే తొలిసారి
Virat Kohli: అయ్యో విరాట్‌ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!

‘పరుగుల రారాజు’ విరాట్‌ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్‌-20 నుంచి కూడా ఔట్‌ అయ్యాడు.

బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయాడు. ఈ దశాబ్ద కాలంలో టాప్‌ 20 నుంచి స్థానం గల్లంతవడం ఇదే మొదటిసారి. చివరగా 2014 డిసెంబర్‌లో విరాట్ టాప్‌ 20లో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్‌లో 13.4 సగటు నమోదు చేయడంతో ర్యాంకుల్లో దిగజారాడు. ఆపై పుంజుకున్న విరాట్.. 2018లో నంబర్‌వన్‌ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. మొన్నటివరకు టాప్తా-10లో ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 15.50 సగటుతో పరుగులు చేయడంతో మరోసారి ర్యాంకుల్లో కిందికి పడిపోయాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టాప్‌ 20 నుంచి స్థానం కోల్పోయాడు. రోహిత్ 26వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ టెస్టుల్లో అదరగొట్టిన రిషబ్ పంత్‌ అయిదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ ఓ ర్యాంకు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్‌ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని16వ ర్యాంకుకు చేరుకున్నాడు. జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కాగిసో రబాడ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్‌ టాప్‌-2లో ఉన్నారు.