Leading News Portal in Telugu

Alzarri Joseph has been suspended by the West Indies Cricket Board for two matches


  • వెస్టిండీస్ కెప్టెన్‌తో గొడవ..
  • కట్ చేస్తే రెండు మ్యాచ్లు సస్పెన్షన్‌.
  • వివరాలు ఇలా
Alzarri Joseph Banned: కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే రెండు మ్యాచ్లు సస్పెన్షన్‌

Alzarri Joseph Banned: మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డేలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్, జట్టు కెప్టెన్ షాయ్ హోప్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జోసెఫ్ మైదానాన్ని వీడి డగౌట్‌లోకి వచ్చాడు. అలా వచ్చిన అతను కాసేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంది పోయాడు. ఆ తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ అల్జారీ జోసెఫ్‌తో మాట్లాడిన తర్వాత అతనికి సర్థి చెప్పడంతో.. దాంతో అల్జారీ జోసెఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. చివరకి 10 ఓవర్ల కోటాను పూర్తి చేసి రెండు వికెట్లు తీశాడు. గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వివాదం ఆగలేదు. ఈ ఘటనపై వెస్టిండీస్ క్రికెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అల్జారీ జోసెఫ్ ను శిక్షించింది. అతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

క్రికెట్ వెస్టిండీస్ (CWI) ప్రమాణాలకు తక్కువ ప్రవర్తన కారణంగా అతనిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. జోసెఫ్ వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను స్పష్టంగా వ్యతిరేకించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో, జోసెఫ్ నాల్గవ ఓవర్లో జోర్డాన్ కాక్స్ వికెట్ తీసిన వెంటనే మైదానం నుండి నిష్క్రమించాడు. కెప్టెన్ షాయ్ హోప్ చేసిన ఫీల్డింగ్ పట్ల అతను అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో వెస్టిండీస్‌కు 10 మంది ఆటగాళ్లు మిగిలారు. అయితే ఆరో ఓవర్లో జోసెఫ్ మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చాడు. అల్జారీ జోసెఫ్ ప్రవర్తన క్రికెట్ వెస్టిండీస్ ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉందని క్రికెట్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మైల్స్ బాస్కోంబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రకమైన ప్రవర్తనను క్షమించలేమని, పరిస్థితి తీవ్రత పూర్తిగా గుర్తించబడేలా మేము నిర్ణయాత్మక చర్య తీసుకున్నామని ఆయన అన్నారు.

మరోవైపు, ఓ ప్రకటనలో జోసెఫ్ క్షమాపణలు కూడా చెప్పారు. 27 ఏళ్ల జోసెఫ్ మాట్లాడుతూ.. నేను కెప్టెన్ షాయ్ హోప్, టీమ్ మేనేజ్మెంట్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు కూడా నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇలా చేస్తే విస్తృత ప్రభావాలను కలిగిస్తుందని నేను అర్థం చేసుకున్నాను. నేను తీవ్రంగా చింతిస్తున్నానని మాట్లాడాడు.