Leading News Portal in Telugu

PCB Writes Letter To Pakistan Govt Over Champions Trophy 2025


  • ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
  • 3 నగరాల్లో 15 మ్యాచ్‌లు
  • ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు
Champions Trophy 2025: పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే పీసీబీ ఆశలు పెట్టుకుందట.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. పీసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీసీసీఐ వెనక్కి తగ్గడం లేదు. ఐసీసీతో రాయబారం పంపినా బీసీసీఐ ఒప్పుకోలేదు. హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ సముఖంగా ఉంది. భారత్‌ ఆడే మ్యాచులను దుబాయ్‌ లేదా షార్జా వేదికగా నిర్వహించాలని సూచించింది. హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకొనేది లేదంటూ పీసీబీ అంటున్నా.. ఒకవేళ టోర్నీ రద్దయితే ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారత్‌ లేకుండా.. టోర్నీ నిర్వహించినా బొక్క పడుతుంది. దీంతో ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని పీసీబీ నిర్ణయించింది. ఈమేరకు ఐసీసీ పంపిన ఈ-మెయిల్‌ను ప్రభుత్వానికి పీసీబీ పంపినట్లు తెలుస్తోంది.

‘ఐసీసీ నుంచి మాకు మెయిల్ వచ్చింది. భారత జట్టును బీసీసీఐ ఇక్కడకు పంపించడం లేదని అందులో ఉంది. ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు భారత్ రాదు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వానికి పీసీబీ పంపింది. సర్కారు ఇచ్చే సూచనలు, సలహాలపైనే తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ట్రోఫీ కోసం పీసీబీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.