Leading News Portal in Telugu

Team India Starts practice in Perth for Border Gavaskar Trophy 2024-25


  • ఆస్ట్రేలియా చేరుకున్న భారత్
  • నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు
  • భారత్‌-ఏతో మ్యాచ్‌ రద్దు
Border Gavaskar Trophy: భారత్‌-ఏతో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న టీమిండియా!

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు రెండు బృందాలుగా ఆస్ట్రేలియా చేరుకుంది. బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనే దిశగా రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. తొలి శిక్షణ శిబిరంలో శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్, యశస్వి జైస్వాల్ తదితరలు బ్యాటింగ్‌ సాధన చేశారు. హిట్టర్లు పంత్, జైస్వాల్‌ భారీ షాట్లు ఆడారు. జైస్వాల్‌ కొట్టిన ఓ బంతి స్టేడియం పక్కనే ఉన్న రహదారిపై పడింది.

నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు బయటి జనాలకు కనిపించకుండా ఇనుప చువ్వల గోడపై మైదాన సిబ్బంది నల్లటి కవర్లు కప్పారు. స్టేడియం సిబ్బంది, ప్రతినిధులు ఫోన్లు వాడటంపై కూడా పరిమితులు విధించారు. అయినప్పటికీ టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. వాకా మైదానంలోని నెట్స్‌లో రోహిత్ సేన చెమటోడ్చినట్లు కనిపించింది. భారత ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ ముమ్మరంగా చేశారు.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ నవంబర్ 22న ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. పెర్త్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 22న ఉదయం 7:50కి ఆరంభమవుతుంది. మొదటి టెస్టుకు ముందు భారత్‌-ఏతో టీమిండియా సన్నాహక మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకుంది. ఆ సమయంలో టీమిండియా ప్రాక్టీస్‌ చేయనుంది. ఆస్ట్రేలియా-ఏతో రెండు మ్యాచ్‌ల కోసం భారత్‌-ఏ ఆసీస్ వెళ్లిన విషయం తెలిసిందే.