Leading News Portal in Telugu

SA vs IND 3rd T20I: Tilak Varma scores maiden T20I century for India


  • తిలక్‌ వర్మ మెరుపు సెంచరీ
  • చరిత్ర సృష్టించిన తిలక్
  • బద్దలైన సురేశ్ రైనా రికార్డు
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !

తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్‌; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది.

2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సురేశ్ రైనా సెంచరీ చేశాడు. 23 ఏళ్ల 156 రోజుల వయసులో మిస్టర్ ఐపీఎల్ ఈ ఫీట్ సాధించాడు. తిలక్ వర్మ 22 ఏళ్ల 4 రోజుల వయసులోనే శతకం సాధించి.. అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ జాబితాలో కివీస్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (26 ఏళ్ల 84 రోజులు), పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (26 ఏళ్ల 181 రోజులు), విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (27 ఏళ్ల 355 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

దక్షిణాఫ్రికాపై సెంచరీతో తిలక్ వర్మ మరో రికార్డ్ కూడా తన పేరుపై లికించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో శతకం సాధించిన రెండో పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ (21 ఏళ్ల 279 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 146 రోజులు), సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు), అభిషేక్ శర్మ (23 ఏళ్ల 307 రోజులు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 రన్స్ చేసింది. తిలక్‌ వర్మ సెంచరీ చేయగా.. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3×4, 5×6) హాఫ్ సెంచరీ బాదాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్‌ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌ చేసినా ఓడక తప్పలేదు. అర్ష్‌దీప్‌ (3/37), వరుణ్‌ చక్రవర్తి (2/54), అక్షర్‌ పటేల్‌ (1/29) రాణించారు.