Leading News Portal in Telugu

India qualify for semi-finals with 13-0 win vs Thailand


  • మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయం
  • 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించిన భారత మహిళల హాకీ జట్టు.
Asian Champions Trophy: భారత్ జోరు.. రఫ్పాడించిన మహిళా ఆటగాళ్లు

మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున దీపికా కుమారి 5 గోల్స్ చేసింది. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. దక్షిణ కొరియాతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ దీపిక రాణించింది. ఆ మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. భారత్ తరఫున లాల్‌రెమ్సియామి దేవి, ప్రీతి దూబే, మనీషా చౌహాన్ చెరో 2 గోల్స్ చేశారు. ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

చైనా కూడా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నవంబర్ 14న జరిగిన మూడో మ్యాచ్‌లో చైనా 2–1తో జపాన్‌ను ఓడించింది. భారత్‌తో పోలిస్తే చైనా గోల్ తేడా చాలా ఎక్కువగా ఉంది. నవంబర్ 12 వరకు చైనా గోల్ తేడా 20 కాగా, ఇప్పుడు 21కి పెరిగింది. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో చైనా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగడానికి ఇదే కారణం.

కాగా.. భారత్ ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. దాదాపు సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్ తదుపరి మ్యాచ్ 16న చైనాతో జరగనుంది. ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ వర్సెస్ థాయ్‌లాండ్ మ్యాచ్‌కు ముందు మలేషియా 2-1తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. అంతకు ముందు చైనా తొలి మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించింది.