- ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు
- కోట్లాది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి
- పరుగుల వరద పారించిన ట్రావిస్ హెడ్
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. కోట్లాది భారతీయుల గుండెలు బద్దలయ్యాయి. ప్రపంచకప్ మనదే అనుకున్న క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా కంటతడి పెట్టారు. బరువెక్కిన హృదయంతో మైదానంను వీడారు. ఇందుకు కారణం వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో చేతిలో భారత్ ఓటమి పాలవ్వడమే. అద్భుతమైన ఆటతో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. తృటిలో కప్‌ను చేజార్చుకుంది.
2023 నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 240 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66)లు హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలక ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్ (4), శ్రేయస్ అయ్యర్ (4), సూర్యకుమార్ యాదవ్ (18) సహా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (9) తీవ్రంగా నిరాచపర్చారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ 3, జోష్ హాజిల్‌వుడ్2 వికెట్స్ పడగొట్టారు.
ఛేదనలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4) త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ విజయం ఖాయమే అనుకున్నారు. ఈ సమయంలో మార్నస్ లబుషేన్ (58) అండతో ట్రావిస్ హెడ్ (137) జట్టును ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో రెచ్చిపోయాడు. లబుషేన్ నెమ్మదిగా ఆడగా.. హెడ్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఏ భారత బౌలర్‌ను వదలేదు. ముందుగా ఫిఫ్టీ చేసి ఆస్ట్రేలియాను రేసులోకి తెచ్చిన హెడ్.. ఆపై సెంచరీ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మూడు వికెట్స్ పడిన సమయంలో హెడ్ కూడా అవుట్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. భారత్ ఓటమి అనంతరం అభిమానులు ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. టీమిండియా క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన ఈ ఫైనల్ మ్యాచ్ జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ‘ఒకే ఒక్కడు ఎంతపని చేసే’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.