- జడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- స్టార్ ఆటగాళ్లను కొనేందుకు సిద్దమైన ఫ్రాంచైజీలు
- ప్రత్యేక ఆకర్షణగా కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం ప్రక్రియ జరగనుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 574 మందినే బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పది ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక వేలంలో టీమిండియా స్టార్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిపై కోట్ల వర్షం కురవనుంది.
ముఖ్యంగా కేఎల్ రాహుల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఫ్రాంచైజీలు పోటీపడతాయని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు. ఇరు జట్లకు కీపర్ అవసరమవ్వడంతో రాహుల్ కోసం పోటీపడతాయని సన్నీ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ… ‘లోకేష్ రాహుల్ కోసం రెండు దక్షిణాది ఫ్రాంచైజీలు బెంగళూరు, చెన్నైలు పోటీపడతాయి. బహుశా హైదరాబాద్ కూడా పోటీపడొచ్చు. బెంగళూరు రాహుల్ స్వస్థలం కాబట్టి ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు అతడు ఉత్సాహంగా ఉంటాడనుకుంటున్నా. సొంత అభిమానులు మధ్య ఆడాలని ప్రతి ప్లేయర్ కోరుకుంటాడు. రాహుల్ కోసం బెంగళూరు గట్టిగా ప్రయత్నిస్తుంది’ అని చెప్పాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రాంచైజీ కేఎల్ రాహుల్‌ను ఐపీఎల్ 2025 వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా అందరి ముందే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ బయటికొచ్చాడని తెలుస్తోంది. రాహుల్ కోసం ఆర్‌సీబీ, సీఎస్‌కేతో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్, ఢిల్లీ, ఆర్‌సీబీ జట్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. చూడాలి మరి రాహుల్ ఏ ప్రాంచైజీకి వేళ్తాడో.