- నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్
- టీమిండియాను వేధిస్తోన్న ఓపెనర్ సమస్య
- రాహుల్ ఓపెనర్‌గా వద్దన్న సంజయ్
నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో భారత జట్టుకు ఈ సిరీస్ కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 4-0తో గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్టులోనే విజయం సాధించి ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా చూస్తోంది. ఈ కీలక సమరానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే టీమిండియాను ఓపెనర్ సమస్య వేధిస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. డాన్స్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఎవరు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియా-ఏ మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఈశ్వరన్ కూడా రాణించలేదు. ఇద్దరు విఫలమవడం భారత్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో ఓపెనర్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌లో ఓపెనర్ ఫైర్ కనిపించడం లేదని, అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలని పేర్కొన్నాడు.
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే నిలకడ, దూకుడు ముఖ్యం. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌లో ఓపెనర్ ఫైర్ కనిపించడం లేదు. రాహుల్ ఆటను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రాహుల్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది కానీ.. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందనిపిస్తోంది. ఏ సమయంలో అతడిని ఓపెనర్‌గా పంపిచడం సరైన నిర్ణయం కాదు. తొలి మూడు స్థానాల్లో దిగే బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ రాహుల్ విఫలమైతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపిస్తే బాగుంటుంది. దక్షిణాఫ్రికాలోనూ మిడిలార్డర్‌లో ఆడి రన్స్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని సూచించాడు. అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్‌గా రావాలని సంజయ్ చెప్పకనే చెప్పాడు.