Leading News Portal in Telugu

India beats China, defends Women’s Asian Champions Trophy title


  • ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
  • బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసిన భారత్
  • మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న ఇండియా.
Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..

భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.

మొత్తంగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మూడోసారి గెలుచుకుంది. అంతకుముందు 2023లో రాంచీలో, 2016లో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. భారత మహిళల జట్టు హరేంద్ర సింగ్ హయాంలో (ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విజయంపై.. భారతీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఘోర పరాజయం పాలైన భారత మహిళల హాకీ జట్టు.. ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా అత్యుత్తమ జట్టుగా నిలిచింది.

ఈ టోర్నీలో ఆడిన ఏడు గేమ్‌ల్లో గెలుపొందింది. గ్రూప్ దశలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌ను 2-0తో ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన చైనా.. టోర్నీలో అత్యధిక ర్యాంక్ సాధించిన జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో చైనా తన 5 పూల్ గేమ్‌లలో 4 గెలిచింది. సెమీస్‌లో మలేషియాను 3-1 తేడాతో ఓడించింది.