- అంపైర్ ముఖమంతా గాయాలు
- డాక్టర్ల అబ్జర్వేషన్‌లో అంపైర్
- పెర్త్ మైదానంలోనే ఘటన
క్రికెట్ ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు గాయాలు అవ్వడం సహజమే. ఒక్కోసారి ఫీల్డ్ అంపైర్లకూ గాయాలు తప్పవు. ఫీల్డర్ బంతిని విసిరినపుడు అంపైర్లకు గాయలవుతుంటాయి. అదే సమయంలో బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడినపుడు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టోనీ డి నోబ్రెగాకు ఇదే పరిస్థితి ఎదురైంది. బ్యాటర్ స్ట్రెయిట్ షాట్ కారణంగా టోనీ ముఖమంతా గాయాలయ్యాయి. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగనున్న పెర్త్ మైదానంలోనే ఈ ఘటన జరగడం విశేషం.
వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నార్త్ పెర్త్, వెంబ్లే డిస్ట్రిక్ట్స్ మధ్య నాలుగు రోజుల కిందట థర్డ్ గ్రేడ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో బ్యాటర్ స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా టోనీ డి నోబ్రెగా వైపు దూసుకొచ్చింది. బంతిని తప్పించుకొనేందుకు అంపైర్ ఎంత ప్రయత్నించినా.. నేరుగా ముఖం మీద తాకింది. దాంతో అతడి కన్ను, మూతి పగిలిపోయాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి బోన్ బ్రేకింగ్ కాలేదు. ప్రస్తుతం టోనీ డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు చెప్పారు.
గత శనివారం ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లో సీనియర్ అంపైర్ టోనీ డినోబ్రెగా విధులు నిర్వర్తింస్తుండగా.. బ్యాటర్ ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అతడి ముఖం మీద తాకిందని వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ అసోషియేషన్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి బోన్ బ్రేకింగ్ లేదని, అతడు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నాడని చెప్పింది. టోనీ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి దిగాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్వీట్ చేసింది. టోనీ గాయాలకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.