- నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం
- నవంబర్ 22 నుంచి పెర్త్ టెస్ట్
- మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. వేలంలో ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎంత ధరకు అమ్ముడవుతారని ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఓ చెత్త నిర్ణయం తీసుకుందన్నాడు.
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం.. పెర్త్ టెస్టు ఉదయం 7.50 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 2.50కు పూర్తవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే మూడు, నాలుగు రోజుల్లోనే ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. టెస్ట్ మ్యాచ్ పూర్తయిన పది నిమిషాలకు వేలం ఆరంభం అవుతుంది. తొలి టెస్టు జరిగే రోజుల్లోనే వేలం నిర్వహించడం వల్ల ప్లేయర్స్ ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని మైకేల్ వాన్ అన్నాడు. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్యలో 9 రోజుల సమయం ఉందని.. ఆ టైమ్‌లో ఆక్షన్ నిర్వహిస్తే బాగుండని అభిప్రాయపడ్డాడు.
మైఖేల్ వాన్‌ను కోడ్ స్పోర్ట్స్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టు మధ్యలో ఐపీఎల్ 2025 వేలం నిర్వహించడాన్ని నేను అంగీకరించను. ఇది బీసీసీఐ తీసుకున్న చెత్త నిర్ణయం. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్యలో 9 రోజుల సమయం ఉంది. టెస్టు జరుగుతున్న సమయంలో ప్లేయర్లు ఒత్తిడికి గురవుతారని తెలిసినపుడు.. ఆ సమయంలో వేలాన్ని ఎందుకు నిర్వహించకూడదు’ అని ప్రశ్నించాడు. వాన్ చెప్పింది నిజమే అని కొందరు మాజీలు అంటున్నారు. ప్లేయర్స్ వేలంపై మనసు పెడతారని, ఆటపై పెట్టారని అంటున్నారు.