- 10 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో విషాద సంఘటన
- నవంబర్ 27న మైదానంలో ప్రాణాలు కోల్పోయిన ఫిల్ హ్యూస్
- ఈరోజు ఫిల్ హ్యూస్ 10వ వర్ధంతి సందర్భంగా నివాళులు.
క్రికెట్ ఆటలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించరు. కొన్నిసార్లు బంతి తాకడం, జారి పడిపోవడం, పరుగెడుతుంటే నరాలు పట్టేయడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. 10 సంవత్సరాల క్రితం జరిగిన విషాద సంఘటన ఆస్ట్రేలియా క్రికెటర్లను ఎంతో దు:ఖంలోకి నెడుతుంది. క్రికెట్ మైదానంలో ఒక క్రికెటర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన 2014 నవంబర్ 27న జరిగింది. అతనెవరో కాదు.. దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్. ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌తో అతను గాయపడి మైదానంలో పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. రెండు రోజుల తర్వాత అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు సీన్ అబాట్ దివంగత ఫిల్ హ్యూస్‌కు నివాళులర్పించాడు. ఈ సందర్భంగా సీన్ అబాట్ ఎమోషనల్‌గా కనిపించాడు. ఈరోజు.. ఫిల్ హ్యూస్ 10వ వర్ధంతి సందర్భంగా అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు క్రికెటర్‌కు నివాళులర్పించారు. అయితే.. ఫిల్ హ్యూస్‌కు నివాళులర్పించిన సీన్ అబాట్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు జాతీయ గీతం కోసం నిలబడ్డారు. ఒక నిమిషం మౌనం పాటించిన సీన్ అబాట్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. ఆ తర్వాత తోటి ఆటగాళ్లు అతని దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి ఓదార్చారు.
ఫిల్ హ్యూస్ ఎలా మరణించాడు..?
2014 నవంబర్ 25న స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి ఫిల్ హ్యూస్ తలకు తగిలింది. న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిల్ హ్యూస్ బౌన్సర్‌ను ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బలంగా అతని హెల్మెట్‌ను తాకుతుంది. దీంతో.. వెంటనే కింద పడిపోగా మైదానంలో ప్రథమ చికిత్స అందించి సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనిని రక్షించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ అతను రెండు రోజుల తరువాత నవంబర్ 27న మరణించాడు. ఫిల్ హ్యూస్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడితే.. అతను ఆస్ట్రేలియా కోసం 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1,535 పరుగులు చేశాడు. దీంతో పాటు 25 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడాడు.