Leading News Portal in Telugu

Syed Mushtaq Ali Trophy 2024: Urvil Patel Breaks Rishabh Pant’s Century Record


  • 28 బంతుల్లోనే శతకం
  • రిషబ్ పంత్‌ రికార్డు బ్రేక్
  • నాలుగు రోజుల ముందు చేసుంటే
Urvil Patel Century: 28 బంతుల్లోనే సెంచరీ.. ఎంతపనాయే రాములా!

గుజరాత్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ సెంచరీతో చెలరేగాడు. 28 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2024లో భాగంగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌లో త్రిపురతో జరిగిన మ్యాచులో ఉర్విల్‌ 35 బంతుల్లో 7 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో.. టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్ పంత్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.

ఇదివరకు రిషబ్ పంత్‌ 32 బంతుల్లో సెంచరీ చేశాడు. 2018లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన పంత్ 32 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పుడు ఆ రికార్డును ఉర్విల్‌ పటేల్‌ బ్రేక్ చేశాడు. ఇక టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ఉర్విల్‌ నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్.. సైప్రస్‌ జట్టుపై 27 బంతుల్లో సెంచరీ చేశాడు. 2013లో పూణే వారియర్స్ జట్టుపై బెంగళూరు ప్లేయర్ క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం అందుకున్నాడు. పంత్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

2023లో విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా చండీగఢ్‌ వేదికగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన మ్యాచులో గుజరాత్ తరపున ఆడిన ఉర్విల్‌ పటేల్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 41 బంతుల్లో సెంచరీ బాదాడు. 2010లో మహారాష్ట్రపై బరోడా తరఫున యూసుఫ్ పఠాన్ 40 బంతుల్లో చేసిన సెంచరీ బాదాడు. ఉర్విల్‌ విరుచుకుపడడంతో 156 పరుగుల లక్ష్యాన్నిగుజరాత్ 58 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా ఉర్విల్‌ మిగిలాడు. ఓ నాలుగు రోజుల ముందు ఈ సెంచరీ చేసుంటే.. మనోడికి మంచి ధర దక్కేది. ఈ ఇన్నింగ్స్ చూసిన ఫాన్స్.. ‘ఎంతపనాయే రాములా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.