Leading News Portal in Telugu

A big shock for Australia before the Adelaide Test..!


  • డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్ట్
  • టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కు గాయం
  • మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ వేలికి గాయం
  • కొద్దిసేపటి తర్వాత ప్రాక్టీస్‌లో పాల్గొన్న స్టీవ్ స్మిత్.
IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!

డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడటం జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ గాయపడ్డాడు. నెట్స్‌లో మార్నస్ లబుషేన్ వేసిన త్రో పడుతుండగా అతని వేలికి గాయమైంది. దీంతో.. తీవ్ర నొప్పి రావడంతో నెట్స్‌ నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో.. స్టీవ్ స్మిత్ రెండో టెస్టులో ఆడుతాడా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే.. ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గైర్హాజరు కావడం పట్ల ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలినట్లైంది.

తాజా అప్‌డేట్ ఏమిటంటే.. స్టీవ్ స్మిత్ కొంత సమయం తర్వాత నెట్స్‌లోకి తిరిగి వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. స్మిత్ రెండో టెస్టుకు ఫిట్‌గా ఉన్నాడని.. అతని వేలి గాయం తీవ్రంగా లేదని స్పష్టమైంది. రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ అవసరం చాలా ఎక్కువ. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాట్ కమిన్స్ నేతృత్వంలోని కంగారూ జట్టు 295 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఆతిధ్య జట్టు అడిలైడ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తుంది. పింక్ బాల్‌తో ఆస్ట్రేలియా రికార్డు అద్భుతంగా ఉంది. ఆసీస్ జట్టు ఇప్పటివరకు పింక్ బాల్‌తో 12 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 11 మ్యాచ్‌లు గెలిచింది. అయితే.. గబ్బాలో జరిగిన పింక్ బాల్ టెస్టులో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. అడిలైడ్‌లో పింక్ బాల్‌తో ఏడు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. అన్నింటిలోనూ గెలిచింది. పింక్ బాల్‌తో భారత్‌ రికార్డు చూస్తే.. నాలుగు టెస్ట్‌లు ఆడి మూడు గెలిచింది. ఒక టెస్ట్ ఓడిపోయింది. కాగా.. అడిలైడ్ టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని చూస్తుంది.