Leading News Portal in Telugu

Who is the next BCCI secretary, Devjit Saikia and Anil Patel in race


BCCI Secretary: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరున్నారంటే?

డిసెంబరు 1న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్లడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ పదవికి ఇద్దరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా ఉన్న దేవ్‌జిత్ సైకియాలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. డీడీసీఏ ప్రెసిడెంట్ రోహన్‌ జైట్లీ కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.

‘ఏం జరుగుతుందో మాకు తెలియదు. బీసీసీఐ అధికారులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉన్నారు. రోజువారీ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. కార్యదర్శిగా ఎన్నికయ్యే వారికి బీసీసీఐ ఎలా నడుస్తుందనే దానిపై కాస్తయినా అవగాహన ఉండాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం… ఎన్నికైన ఆఫీస్ బేరర్ రాజీనామా చేస్తే 45 రోజుల్లోగా బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించి.. అతని స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించడం కోసం 4 వారాల ముందు ఎన్నికల అధికారిని కూడా నియమించాలి.