Leading News Portal in Telugu

After Ravichandran Ashwin Retirement, His Wife Prithi Narayanan’s 1st Reaction


  • రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్మెంట్ పై స్పందించిన భార్య ప్రీతి నారాయణన్‌..
  • గత రెండ్రోజులుగా నాకు దిక్కుతోచడం లేదని వెల్లడి..
  • అశ్విన్ సాధించిన విజయాల గురించి తెలుపుతూ ఎక్స్ వేదికగా ప్రీతి పోస్ట్
R.Ashwin Wife: మా ఆయన రిటైర్మెంట్తో రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదు..

R.Ashwin Wife: టెస్టుల్లో భారత జట్టుకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్‌ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే.. రోహిత్‌శర్మతో కలిసి విలేకరుల ముందుకు వచ్చిన అశ్విన్‌ తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపాడు. దీంతో అతని రిటైర్మెంట్ ప్రకటన అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనుకోండి. ఇంత హడావుడిగా అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడా? అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఇక, రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్‌ కూడా రియాక్ట్ అయ్యారు. గత రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదన్నారు. నా ఫేవరెట్ క్రికెటర్‌ గురించి చెప్పాలా? లేక నా జీవిత భాగస్వామి అనే కోణాన్ని ఎంచుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నానని ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తమ మధ్య ఉన్న అనుబంధంతో పాటు అశ్విన్ సాధించిన విజయాల గురించి తెలియజేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకున్నామని చెప్పుకొచ్చింది. మెల్‌బోర్న్‌, గబ్బా టెస్టుల్లో విజయం, టీ20ల్లోకి అశ్విన్‌ పునరాగమనం చేసిన తర్వాత కూడా తాను భావోద్వేగానికి గురయ్యామని వెల్లడించింది. క్రికెట్ పై రవిచంద్రన్ అశ్విన్‌ ఎంత నిబద్ధతతో ఉండేవాడో ప్రీతి నారాయణన్ వివరించింది.