- టీమిండియాకు కష్టాలు..
- రోహిత్, రాహుల్ లకు గాయాలు..
- టీమ్‌పై ప్రభావం పడనుందా?
BGT Series: మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే నాలుగో టెస్టుకు అత్యంత కీలకం కానుంది.
ఒకవేళ కేఎల్ రాహుల్ దూరమైతే, అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దేశీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఈశ్వరన్ జాతీయ జట్టుకు తన పేరు వినిపించాడు. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 48.87 సగటుతో 7674 పరుగులు చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్‌మన్ 27 సెంచరీలు, 29 అర్ధసెంచరీలతో తన సత్తా చాటాడు. అయితే, అతనికి ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఆటకు దూరమైతే, అతని స్థానంలో జట్టు మేనేజ్మెంట్ ముందున్న ఎంపికలు చాలా ఉన్నాయి. జట్టులో బ్యాటింగ్ బలాన్ని పెంచాలనుకుంటే యువ ఆటగాడు ధృవ్ జురెల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. మరోవైపు, వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం ద్వారా జట్టుకు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా మద్దతు పొందవచ్చు.
రోహిత్ శర్మ టెస్టుకు దూరమైతే, జట్టుకు నాయకత్వం వహించడానికి జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ అందుబాటులో ఉన్నాడు. రోహిత్ శర్మ తన రెండవ బిడ్డ పుట్టిన సందర్భంగా పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్నప్పుడు, బుమ్రా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఈ నేపథ్యంలో, నాలుగో టెస్టు ఇరు జట్లకు విజయాల మార్గాన్ని నిర్ణయించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దింతో ప్రస్తుతం అభిమానులు ఇప్పుడు ఈ గాయాల నుంచి జట్టు ఎలా అధిగమిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.