- డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
- అదనపు డ్రింక్ విరామాలు
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్ట్ భారత్, అడిలైడ్ టెస్ట్ ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ నాలుగో టెస్టు గురువారం (డిసెంబర్ 26) నుంచి ఆరంభమవుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. మెల్‌బోర్న్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యం సంపాదించనుంది. అయితే ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను వాతావరణం వేడేక్కించనుంది.
మెల్‌బోర్న్‌లో తొలి రోజు ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదు కానుందట. 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశముందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది. ఆటగాళ్లు, ప్రేక్షకులు వేడిని తట్టుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆటగాళ్లకు అదనపు డ్రింక్ విరామం ఇచ్చే అవకాశముంది. సన్‌స్క్రీన్లు వాడాలని, టోపీలు పెట్టుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని ప్రేక్షకులకు సీఏ సూచించనుంది. మెల్‌బోర్న్ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
మెల్‌బోర్న్‌లో జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఉష్ణోగ్రత 36 డిగ్రీలు దాటితే.. ఆటను నిలిపేస్తారు. అయితే క్రికెట్లో అలాంటి నిబంధనలు మాత్రం లేవు. 2018లో సిడ్నీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా.. యాషెస్ టెస్టు మ్యాచ్ కొనసాగింది. అప్పుడు అదనపు డ్రింక్ విరామాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అంత వేడిని తట్టుకుని ప్లేయర్స్ ఎలా ఆడతారో చూడాలి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయితే బౌలర్లకు కష్టంగా ఉంటుందన్నా విషయం తెలిసిందే.