International Masters League (IML 2025) to Begin on February 22, Sachin Tendulkar leading Team india once more
- ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025).
- ఐఎమ్‌ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్ తో ముగిస్తుంది.
- టీమిండియా జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.

IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్‌ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్‌తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారతదేశం, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్‌లో రిటైర్ అయిన క్రికెటర్లు పాల్గొంటారు.
ఇకపోతే టీమిండియా జట్టుకు సచిన్ టెండుల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా జట్టుకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికా జట్టుకు జాక్వెస్ కలిస్, వెస్టిండీస్ జట్టుకు బ్రియన్ లారా, శ్రీలంక జట్టుకు కుమార్ సంగక్కర, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ లు సారథ్యం వహించనున్నారు. ఈ లీగ్‌కు సంబంధించి సునిల్ గావస్కర్‌ను కమిషనర్‌గా నియమించారు. గావస్కర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను ఒకే వేదికపై కనిపించేలా ఐఎమ్‌ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తాం” అని తెలిపారు. వాస్తవానికి, ఐఎమ్‌ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పోలాక్ కూడా ఉన్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, డీవై పాటిల్ స్టేడియం (నవీ ముంబై), నిరంజన్ షా స్టేడియం (రాజ్‌కోట్), షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం (రాయ్‌పూర్) ఈ లీగ్ కోసం పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఐసీసీ వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర జట్లు పోటీపడతాయి. ఐఎమ్‌ఎల్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమవుతుంది. అంటే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలైన మూడు రోజులకే ఐఎమ్‌ఎల్ ప్రారంభం అవుతుంది. దీనితో సచిన్ టెండుల్కర్ మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో కనిపించనుండటం క్రికెట్ అభిమానులకు పండుగా కానుంది.