Sanju Samson Faces Setback as He Misses Vijay Hazare Trophy, Raises Concerns for ODI Series and Champions Trophy Selection
- సంజు శాంసన్‌పై బీసీసీఐ ఫైర్.
- దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమే కారణం.
- ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిషభ్ పంత్, KL రాహుల్, ధ్రువ్ జురెల్‌లతో ప్రధాన వికెట్ కీపర్ గా పోటీ.

Sanju Samson: ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజూ శాంసన్‌కి ఇబ్బంది కలిగించింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA)కు శాంసన్ ఈ టోర్నమెంట్ కోసం అందుబాటులో ఉండలేనని తెలియజేశాడు. ఈ కారణంగా KCA అతన్ని విజయ్ హజారే ట్రోఫీ నుంచి తొలగించింది. అయితే, అతను టోర్నీలో పాల్గొనకపోవడం వెనుక కారణాలను బీసీసీఐకు చెప్పకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.
బీసీసీఐ నియమాల ప్రకారం, టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. జట్టు ఎంపికలో దేశవాళీ ప్రదర్శన కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో బీసీసీఐ శాంసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను ఈ టోర్నీలో ఎందుకు పాల్గొనలేదనే కారణం తెలుసుకోవాలని సెలక్టర్లు ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం శాంసన్, KCA మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. అయితే, ఈ వివాదాలను పరిష్కరించుకుని అతను దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తోంది.
ఇకపోతే, సంజూ శాంసన్ ఇప్పుడు రిషభ్ పంత్, KL రాహుల్, ధ్రువ్ జురెల్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రధాన వికెట్ కీపర్ పోటీదారులలో ఒకడిగా ఉన్నాడు. అయితే, అతను దేశవాళీ క్రికెట్ టోర్నీని పక్కన పెట్టడం వల్ల టీమిండియా జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇందుకుగానూ, బోర్డు అతనిపై చర్యలు తీసుకుంటే శాంసన్‌కి వచ్చే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉండక పోవచ్చు. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఇంతకు ముందు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు జట్టులో స్థానాలను కోల్పోయిన విషయం తెలిసిందే.