Leading News Portal in Telugu

India Wins Champions Trophy 2025 in Divyang Cricket, Defeats England by 79 Runs


  • దివ్యాంగ క్రికెట్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా.
  • ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం.
  • క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడి గౌరవంగా నిలుస్తుందన్న DCCI.
Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా

Champions Trophy 2025: శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత దివ్యాంగ క్రికెట్‌ టీమ్‌ అద్భుత విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు, టోర్నమెంట్‌ విజేతగా నిలిచింది. భారత దివ్యాంగ క్రికెట్‌ కౌన్సిల్‌ (DCCI) ఈ గెలుపును అధికారికంగా ప్రకటిస్తూ.. జట్టు సమిష్టి కృషిని కొనియాడింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ జట్టు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 118 పరుగులకే ఆలౌటైంది. భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. అతను నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో కేవలం 40 బంతుల్లో 73 పరుగులు చేసి ఇంగ్లండ్‌ బౌలర్లను బాదేశాడు. భారత బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ జట్టును సమూలంగా దెబ్బతీశారు. రాధికా ప్రసాద్‌ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. కెప్టెన్‌ విక్రాంత్‌ కేనీ రెండు వికెట్లు తీయగా, రవీంద్ర సంటే రెండు వికెట్లు తీసి విజయానికి తోడ్పడ్డాడు.

ఇక మ్యాచ్ తర్వాత కెప్టెన్ విక్రాంత్‌ కేనీ మాట్లాడుతూ.. “ఈ గెలుపు నా కెరీర్‌లో గర్వకారణం. జట్టులో ప్రతి ఆటగాడి కృషి ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడింది” అని ఆయన తెలిపారు. ఇక జట్టుపై ప్రధాన కోచ్‌ ప్రశంసలు కురిపించారు. జట్టు ప్రధాన కోచ్‌ రోహిత్ జలానీ, తన జట్టు అసాధారణ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ప్రతి పరిస్థితిని అధిగమిస్తూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, ఈ విజయంతో భారత దివ్యాంగ క్రికెట్‌ జట్టు కొత్త ఎత్తులకు చేరుకుందని కోచ్‌ అన్నారు.”ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం, భారత క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఇది భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడి గౌరవంగా నిలుస్తుంది” అని DCCI ప్రకటించింది. ఈ అద్భుత గెలుపుతో భారత దివ్యాంగ క్రికెట్‌ జట్టు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.