Team India Faces Fitness Concerns for Abhishek Sharma and Mohammed Shami Ahead of 2nd T20I Against England
- ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా.
- గాయాలతో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.
- నేటి రెండో టి20 మ్యాచ్ లో ఆడడం కష్టమే!

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ప్రారంభించింది. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో విజయం నమోదు చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఇది ఇలా ఉంటే.. మొదటి టి20 హీరో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రెండవ టి20 మ్యాచ్‌కు ముందు అతని ఫిట్నెస్ టీమ్ ఇండియాకు టెన్షన్‌గా మారింది. శుక్రవారం నాడు టీం ఇండియా ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వచ్చింది. ఈ ప్రాక్టీస్ సెషన్లో, అభిషేక్ చీలమండ మెలితిప్పినట్లు, ఆపై అతను నొప్పితో బాధపడినట్లు సమాచారం. అంతేకాదు అతడికి నడవడం కూడా కష్టంగా మారి కుంటుతూ కనిపించాడు. దింతో అతను ప్రాక్టీస్ సెషన్‌ను విడిచిపెట్టి డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చాడు. అభిషేక్ జట్టు ఫిజియో పర్యవేక్షణలో సుమారు అరగంట గడిపాడు. అయితే అతను ప్రాక్టీస్ సెషన్‌కు తిరిగి రాలేదు.దింతో అతను నేడు మ్యాచ్ లో ఆడే అవకాశం కనపడడం లేదు.
మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ పరిస్థితి అభిమానులకు బాధను కలిగించేలా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన టి 20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, చెన్నైలో ప్రాక్టీస్ సెషన్లో అతడి పరిస్థితి చూస్తే మాత్రం నేటి మ్యాచ్ లో ఆడేలా కనపడడం లేదు. షమీ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా పూర్తి లయలో కనపడలేదు. అతని రన్-అప్ కూడా సరిగ్గా కనిపించలేదు. అతను ఇంకా పరిగెత్తడంలో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. బౌలింగ్‌కు స్వల్ప విరామం తర్వాత అతను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.