- 2024 ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ‘స్మృతి మంధాన’.

Smriti Mandhana: 2024లో అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా ఆడిన భారత బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (ICC Women’s ODI Cricketer of the Year) ఎంపికైంది. విషయాన్నీ తాజాగా ఐసీసీ వెల్లడించింది. మంధాన వన్డేలలో కొత్త రికార్డ్స్ ను నెలకొల్పింది. 2024లో 13 ఇన్నింగ్స్‌లలో 747 పరుగులు చేసి క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ పరుగులు చేసింది.
ఇదివరకు లారా వోల్వార్డ్ట్ (697), టామీ బ్యూమాంట్ (554), హేలీ మాథ్యూస్ (469) మహిళా ODIలో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచారు. మంధాన ఈ పరుగులను 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో సాధించింది. ఇది టీమిండియా విజయాలలో ఎంతగానో సహాయపడింది. స్మృతి మంధాన గత సంవత్సరంలో నాలుగు వన్డే సెంచరీలు కూడా చేసింది.
28 ఏళ్ల మంధాన 2024 సంవత్సరంలో 13 మ్యాచ్‌ల్లో 747 పరుగులు చేసింది. మంధాన ఆస్ట్రేలియాపై 29 బంతుల్లో 29 పరుగులు చేసి ఏడాదిని ప్రారంభించగా.. దీని తర్వాత తదుపరి వన్డే కోసం ఆరు నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే, దక్షిణాఫ్రికాతో ఆడినప్పుడు ఆమె అద్భుతమైన ఫామ్‌లో కనిపించింది. నాలుగు సెంచరీలతో పాటు, మంధాన 2024లో మూడు అర్ధ సెంచరీలు కూడా చేసింది. ఈ సమయంలో ఆమె అత్యధికగా వ్యక్తిగత స్కోరు 136 పరుగులను సాధించింది.