Leading News Portal in Telugu

India win over England in fifth T20


  • ఐదో టీ20లో అదరగొట్టిన కుర్రాళ్లు
  • ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్
  • ఐదో టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం
Ind vs Eng 5th T20: ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్.. అదరగొట్టిన కుర్రాళ్లు!

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ సేన ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఐదో టీ20లో అదగొట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది.

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకున్న ఇంగ్లండ్ కు నిరాశ తప్పలేదు. భారీ టార్గెట్ చేధనలో ఇంగ్లీష్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిల్లాడిపోయింది. 10.3 ఓవర్లలో 97 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, వరుణ్ చక్రవర్తి2, రవి బిష్ణోయ్1,శివం దూబే2, అభిషేక్ శర్మ2 వికెట్లు పడగొట్టారు.

యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 37 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సులు బాది 135 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్సే 3, వుడ్2, ఆర్చర్, రషీద్, ఓవర్టన్ తలో వికెట్ తీశారు.