Leading News Portal in Telugu

Dimuth Karunaratne Announces Retirement From International Cricket After 100th Test


  • అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన దిముత్ కరుణరత్నే
  • 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
  • ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో శ్రీలకం రెండో టెస్ట్
  • ఈ మ్యాచ్ అనంతరం రిటైర్ కానున్న కరుణరత్నే.
Dimuth Karunaratne: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్..

శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఈ మ్యాచ్ అతని 100వ టెస్ట్‌గా, క్రికెట్‌లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇటీవల అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్‌లో కరుణరత్నే రాణించలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరుణరత్నే తన చివరి ఏడు టెస్టుల్లో 182 పరుగులు మాత్రమే చేశాడు. దేశీయ క్రికెట్‌లో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. దీంతో.. యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిముత్ కరుణరత్నే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లోని మొదటి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సున్నా, రెండో ఇన్నింగ్స్‌లో 60 నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్ మ్యాచ్‌ల్లో కరుణరత్నే 16 టెస్ట్ సెంచరీలతో మొత్తం 7,172 పరుగులు సాధించాడు. 2021లో అతను బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్‌లో అతని అత్యధిక స్కోరు 244.

దిముత్ కరుణరత్నే టెస్ట్ క్రికెట్‌లో శ్రీలంక తరఫున నిలకడగా ఆడాడు. శ్రీలంక తరపున 50 వన్డేలు, 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే నాల్గవ స్థానంలో ఉంటాడు. అతని కంటే ముందు కుమార్ సంగక్కర (12400), మహేల జయవర్ధనే (11814), ఏంజెలో మాథ్యూస్ (8090) ఉన్నారు.