Leading News Portal in Telugu

Former Sunrisers player Mayank Agarwal at the Maha Kumbh Mela.


  • మహాకుంభ మేళాకు వెళ్లిన మయాంక్ అగర్వాల్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన మయాంక్
  • కుంభమేళాలో పాల్గొని.. ప్రత్యేకమైన భక్తిని చాటుకున్న మయాంక్.
Mayank Agarwal: శరీరంపై కుర్తా, నుదిటిపై తిలకం.. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం( వీడియో)..

భారత జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఇటీవల తన తండ్రితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా.. మయాంక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ స్మరణీయ ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మయాంక్ కూడా కుంభమేళాలో పాల్గొని.. తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ప్రత్యేకమైన భక్తిని చాటుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మయాంక్ తన తండ్రితో కలిసి ఉన్నాడు. ఇద్దరూ శరీరంపై పసుపు కుర్తా ధరించి, నుదిటిపై తిలకం పెట్టుకొని పూజలు చేస్తూ కనిపించారు.

ఆ వీడియోలో.. హర్ హర్ గంగే పాట ప్లే అవుతుండగా, మయాంక్ అగర్వాల్ భక్తితో మునిగిపోయి చేతులు జోడించి పూజలు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా.. ఈ వీడియోని మాయంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఆయన స్నేహితులు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మహాకుంభ మేళాలో ఇప్పటివరకు 40 కోట్లకు పైగా భక్తులు స్నానమాచరించిన విషయం తెలిసిందే.

మయాంక్ అగర్వాల్ తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ముఖ్యమైన క్షణాలను గడిపాడు. 33 సంవత్సరాల మయాంక్ అగర్వాల్ 2022లో శ్రీలంకతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2020లో ఆస్ట్రేలియాతో చివరి వన్డే మ్యాచ్ ఆడిన మయాంక్.. ఆ తర్వాత జట్టులో స్థానం లభించలేదు. తన క్రికెట్ కెరీర్‌లో 21 టెస్ట్ మ్యాచ్‌లలో 1488 పరుగులు, 5 వన్డే మ్యాచ్‌లలో 86 పరుగులు సాధించగా.. 111 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 8050 పరుగులు, 123 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 5616 పరుగులు చేశాడు. మరోవైపు.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ. 1 కోటి కాగా.. ఫ్రాంచైజీలు అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. మయాంక్ 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుఫున ఆడాడు. ఆ తరువాత అతను మెగా వేలానికి ముందు విడుదలయ్యాడు.