Leading News Portal in Telugu

India Completes Clean Sweep Against England with 3-0 Series Win


  • భారత్ ఘన విజయం
  • 142 పరుగుల తేడాతో గెలుపు
  • 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.
IND vs ENG: ఇండియా విక్టరీ.. ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో.. 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు శుభ్‌మాన్ గిల్ (112), శ్రేయాస్ అయ్యర్ (78) పరుగులతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు చేసి ఇంగ్లండ్ ముందు ఉంచింది. దీంతో.. భారత్ అలవోక విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్‌కు ఈ సిరీస్ గెలవడం మంచి ఎనర్జీని ఇస్తుంది. వన్డే సిరీస్ తో పాటు టీ20 సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే…

357 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. ఆరంభంలో బాగానే రాణించింది. 6.2 ఓవర్లలో 60 పరుగులు చేసింది. అనంతరం.. అర్ష్‌దీప్ సింగ్ తొలి వికెట్ తీశాడు. ఫిల్ సాల్ట్‌ను (23) ఔట్ చేసిన కాసేపటికే.. బెన్ డకెట్ (34), టామ్ బెంటన్ (38) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత జో రూట్ (24) కాసేపు పోరాడాడు. చివరలో గస్ అట్కిసన్ (38) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవో చెరో వికెట్ సంపాదించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (112) శతకం సాధించాడు. 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (78) హాఫ్ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. మరోవైపు..ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (52) అర్ధ శతకంతో రాణించాడు. కేఎల్ రాహుల్ (40) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో అత్యధికంగా ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మార్క్ ఉడ్ 2 వికెట్లు తీశాడు. సాకిబ్ మహముద్, గస్ అట్కిసన్, జో రూట్ తలో వికెట్ సంపాదించారు.