- పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్
- న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో..,
- స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ఆరంభం లభించలేదు. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. అలాగే.. ఓటమి అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బుధవారం కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నమెంట్-ఓపెనర్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్‌కు ఐసిసి జరిమానా విధించింది.
ఆతిథ్య జట్టుకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది ఐసీసీ. అలాగే.. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా.. థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ కూడా ఈ అభియోగాలను మోపారు. అంతేకాకుండా.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ జరిమానాను విధించారు. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ నేరాన్ని అంగీకరించినందున అధికారిక విచారణ అవసరం లేదు. ఐసిసి ప్రవర్తనా నియమావళి యొక్క ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఒక జట్టు నిర్ణీత సమయానికి బౌలింగ్ చేయడంలో విఫలమైతే, ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.
1996 తర్వాత తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌ను ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్.. తొలి మ్యాచ్‌లోనే 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 320 పరుగుల లక్ష్యానికి.. పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులు మాత్రమే చేశారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడనుంది.