Leading News Portal in Telugu

IND vs PAK: Virat Kohli React on Cover Drive


  • కవర్‌ డ్రైవ్‌ బాగా ఆడతాడని కోహ్లీకి పేరు
  • ట్రేడ్‌ మార్క్‌ షాటే బలహీనతగా మారింది
  • కొన్నేళ్లలో నా పాత్రలో ఎలాంటి మార్పు లేదు
Virat Kohli: అదే నా బలహీనతగా మారింది: కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని రకాల షాట్స్ ఆడుతాడు. ‘కవర్‌ డ్రైవ్‌’ బాగా ఆడతాడని కోహ్లీకి పేరు. అయితే ఇటీవల తన ట్రేడ్‌ మార్క్‌ కవర్‌ డ్రైవ్‌ షాటే తనకు బలహీనతగా మారిందని అంగీకరించాడు. ఇటీవలి కాలంలో కవర్‌ డ్రైవ్‌ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరుతున్న సంగతి తెలిసిందే. కానీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై మాత్రం అద్భుత కవర్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్ స్పందించాడు.

బీసీసీఐ పోస్ట్‌ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘గత కొన్నాళ్లుగా కవర్‌ డ్రైవ్‌ నా బలహీనతగా మారింది. కవర్‌ డ్రైవ్‌ ఆడబోయి చాలాసార్లు అవుట్ అయ్యాను. గతంలో అదే షాట్‌తో నేను చాలా పరుగులు చేశాను. ఈ రోజు నేను నా షాట్లనే నమ్ముకున్నా. పాకిస్థాన్‌పై తొలి రెండు బౌండరీలు కవర్‌ డ్రైవ్‌ ద్వారానే వచ్చాయి. అలాంటి షాట్స్ ఆడినపుడు నా బ్యాటింగ్ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు ఇది మంచి ఇన్నింగ్స్‌. టీమిండియాకు ఇది మంచి విజయం. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.

పాకిస్థాన్‌పై బ్యాటింగ్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఎక్కువగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినపుడు వచ్చినవే. మూడో స్థానంలో బాధ్యతలపై విరాట్ మాట్లాడుతూ… ‘ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటా. జట్టును గెలిచే స్థితిలో నిలపడంపైనే దృష్టి పెడతా. కుదిరితే నేనే ఛేదన పూర్తి చేస్తా. మ్యాచ్‌ పరిస్థితి ఎలా ఉన్నా కొన్నేళ్లలో నా పాత్రలో ఎలాంటి మార్పు లేదు. జట్టు కోసం పరుగులు చేయాలి, విజయం సాదించాలి’ అని చెప్పుకొచ్చాడు.