Leading News Portal in Telugu

In IND vs PAK match India Crushes Pakistan by Six Wickets in ICC Champions Trophy 2025; Pakistani Fans Emotional Plea to ICC Goes Viral


  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పాక్ అభిమాని వీడియో.
  • ఐసీసీకి తన బాధను వ్యక్తం చేసిన వ్యక్తి.
  • భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండంటూ వీడియో.
IND vs PAK: భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన విజయయాత్రను కొనసాగించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్ధేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. చివరి పరుగులను విరాట్ కోహ్లీ కొట్టి సెంచరీ సాధించడంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే, ఈ ఓటమితో పాకిస్థాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించలేదు. కానీ, సెమీ ఫైనల్స్ అవకాశాలు మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే -1.087 నెట్ రన్ రేట్‌తో ఇబ్బందిలో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్‌ను ఓడించేందుకు భారత్, బంగ్లాదేశ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఓ ఓటమితో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పాకిస్థాన్ అభిమాని ఐసీసీని ఉద్దేశించి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత జట్టుతో ప్రతిసారీ ఒకే గ్రూప్‌లో ఉంచి మళ్లీ మళ్లీ పరాజయాన్ని తలపెట్టొద్దని, ఇలా చేయడం తమకు మానసిక క్షోభ కలిగిస్తోందని అతను వ్యాఖ్యానించాడు.

అంతేకూండా.. ప్రియమైన ఐసీసీ, నా నుండి మీకు ఒక అభ్యర్థన ఉందంటూ.. దయచేసి ప్రతి టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లను వేర్వేరు గ్రూప్‌ల్లో ఉంచండి. ఈ ఓటమిల అవమానాన్ని భరించలేక మేము మానసికంగా కుంగిపోతున్నాం అంటూ సిద్దిక్ అనే పాక్ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల ద్వారా డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమైతే, కనీసం ఆ ఆదాయంలో కొంత భాగాన్ని మాకు ఇచ్చి మంచి హాస్పిటల్‌లో చికిత్స పొందే అవకాశం కల్పించండని అభ్యర్థించాడు. ఇలా ప్రతిసారి ఓడిపోయిన అవమానం.. మాకు భరించలేని స్థాయికి చేరిందంటూ కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ పెద్దెతున్న కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.