Leading News Portal in Telugu

Scrap Shop Demolished in Maharashtra Malvan After Owner Allegedly Raised ‘Pakistan Zindabad’ Slogans at IND vs PAK match


  • మహారాష్ట్రలోని మల్వన్ పట్టణంలో ఘటన
  • భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.
  • తక్షణ చర్యగా ఆ నినాదం చేసిన వ్యక్తి స్క్రాప్ షాప్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసిన మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం.
IND vs PAK: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం.. బుల్డోజర్‌తో షాప్ కూల్చివేత

IND vs PAK: మహారాష్ట్రలోని మల్వన్ పట్టణంలో ఓ స్క్రాప్ షాప్ యజమాని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సోమవారం మల్వన్ మున్సిపల్ కౌన్సిల్ యంత్రాంగం తక్షణ చర్యగా ఆ నినాదం చేసిన వ్యక్తి స్క్రాప్ షాప్‌ను బుల్డోజర్‌తో కూల్చివేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను శివసేన నేత నిలేష్ రాణే తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ.. మల్వన్‌లో ఓ ముస్లిం వలసదారు, స్క్రాప్ వ్యాపారి భారత వ్యతిరేక నినాదాలు చేశాడని, అతడిని మల్వన్‌ నుండి బహిష్కరించడమే కాకుండా, అతని వ్యాపారాన్ని తక్షణమే ధ్వంసం చేశామని చెప్పుకొచ్చాడు. ఈ చర్యలో సహకరించిన మల్వన్ మున్సిపల్ కౌన్సిల్, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో బుల్డోజర్‌తో స్క్రాప్ షాప్‌ను కూల్చివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతిఘటనగా, స్థానికులు సోమవారం ఒక బైక్ ర్యాలీ నిర్వహించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం.. ఆదివారం మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా మల్వన్‌లో ఇద్దరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేయడంతో.. వారిని స్థానికులు వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో మల్వన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు శాంతి భద్రతలు కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.