Leading News Portal in Telugu

Champions Trophy 2025: Najam Sethi Says Imran Khan is Responsible For Pakistan Downfall


  • పాకిస్థాన్‌ వరుస పరాజయాలు
  • పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం
  • ఇమ్రాన్ ఖాన్‌ వల్లే పాక్ క్రికెట్ పతనమైందన్న సేథి
Champions Trophy 2025: ఇమ్రాన్‌ ఖాన్ వల్లే ఈ పరిస్థితి.. పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్‌ వరుస పరాజయాలను ఎదుర్కొంది. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజీలాండ్, భారత్ చేతుల్లో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. సొంత మైదానాల్లో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్‌ సేథి ఫైర్ అయ్యారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ వల్లే పాక్ క్రికెట్ పతనమైందని మండిపడ్డారు. ఇమ్రాన్‌ ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితి కారణం అని పేర్కొన్నారు.

‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దేశంలోని అభిమానుల ఆగ్రహం సరైందే. పాక్ ప్రదర్శన అట్టడుగు స్థాయికి చేరుకుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 1990, 1996లో వన్డేల్లో.. 2016లో టెస్టుల్లో, 2018లో టీ20ల్లో అగ్రస్థానం సాధించిన జట్టు. 1992లో ప్రపంచకప్‌, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్.. ఈ రోజు జింబాబ్వేతో సమానవుంతుందా?. 2019లో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో కొత్త మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణం. దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా మార్చేశారు. దశాబ్దాలుగా అత్యుత్తమ క్రికెటర్లను అందిస్తోన్న దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారు. పాకిస్థాన్‌కు సరిపోని ఆస్ట్రేలియన్ హైబ్రిడ్ మోడల్‌తో పతనం ప్రారంభమైంది’ అని నజామ్‌ సేథి పేర్కొన్నారు.

‘పీసీబీలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. పీసీబీ విధానాలు పూర్తిగా దారితప్పాయి. విదేశీ కోచ్‌లను నియమించారు, ఇష్టమైన వారిని సెలక్టర్లుగా ఎంపిక చేశారు, మేనేజ్‌మెంట్‌లో పాతవారిని తీసుకున్నారు.. ఇలా ఎన్నో జరిగాయి. చివరగా జట్టులోని సహచరులతో కెప్టెన్‌కు పడకపోవడం, టీమ్ గ్రూప్‌లు విడిపోవడంను మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. అన్ని కలిపి ఇప్పుడు దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరించి.. నైపుణ్యాన్ని ఎంకరేజ్ చేస్తే జట్టు గాడిన పడుతుంది’ అని నజామ్‌ సేథి ఎక్స్‌లో రాసుకొచ్చారు.