Leading News Portal in Telugu

IPL 2025: Rahul Dravid Arrives To Rajasthan Royals Camp With Leg Injury


  • ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం
  • 23న రాజస్థాన్ రాయల్స్‌ తన తొలి మ్యాచ్
  • నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్‌
Rahul Dravid: నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్‌ ద్రవిడ్‌.. దటీజ్‌ ‘ది వాల్’!

‘ది వాల్’ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకితభావానికి మారు పేరు ద్రవిడ్‌. ఆటగాడిగా భారత జట్టు తరఫున ఇది ఎన్నోసార్లు నిరూపించాడు. ఇప్పుడు కోచ్‌గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్‌.. గురువారం చేతి కర్రల సాయంతో టీమ్ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. గాయమైన కాలికి స్పెషల్ బూట్‌ వేసుకుని.. కర్రల సాయంతో నడుచుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ తమ అధికారిక ఖాతాలో పోస్ట్‌ చేసింది.

రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవల బెంగళూరులో విజయ సీసీ తరఫున జయాంగర్‌ క్రికెటర్స్‌ జట్టుతో క్లబ్‌ మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌ ఎడమ కాలి పిక్క కండరానికి గాయమైంది. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడడంతో.. గోల్ఫ్‌ కార్ట్‌లో మైదానంలోకి వచ్చి రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేయర్స్ ఆట తీరును పరిశీలించాడు. యువ ఆటగాళ్లు రియాన్‌ పరాగ్, యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. 23న రాజస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. రెండేళ్లు టీమిండియా కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌.. ఇటీవలే రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.