- ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్
- ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది
మొన్నటి వరకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ బజ్ కొనసాగింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్మెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2008 నుంచి మొత్తం 252 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, కోహ్లీ బ్యాట్ 244 ఇన్నింగ్స్‌లలో 8004 పరుగులు చేసింది. రన్ మెషిన్ సగటు 38, స్ట్రైక్ రేట్ 131. ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ అత్యధిక స్కోరు 113 పరుగులు (నాటౌట్). ఇప్పటివరకు అతను ఐపీఎల్లో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు.
శిఖర్ ధావన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో ఐదు జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్లో 2008 నుంచి 2024 వరకు 222 మ్యాచ్‌లు ఆడాడు. ధావన్ 6769 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ధావన్ అత్యధిక స్కోరు 106 నాటౌట్. ఐపీఎల్ టోర్నమెంట్లో 2 సార్లు 100 పరుగులు, 51 అర్ధ సెంచరీలు చేశాడు.
రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2008 నుంచి ఐపీఎల్లో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు. హిట్ మ్యాన్ 252 ఇన్నింగ్స్‌లలో 6628 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. అతని అత్యధిక స్కోరు 109 నాటౌట్. అతని బ్యాట్ నుంచి 2 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.
డేవిడ్ వార్నర్
ఐపీఎల్ 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ 2025 వేలంలో ఎలాంటి బిడ్ ఇవ్వలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు. 2009 నుంచి 2024 వరకు మొత్తం 184 మ్యాచ్‌ల్లో 6565 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 126 పరుగులు. అతని ఖాతాలో 4 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సురేష్ రైనా
CSK మాజీ క్రికెటర్ సురేష్ రైనా 2008 నుంచి 2021 వరకు IPLలో 205 మ్యాచ్‌లు ఆడి, 200 ఇన్నింగ్స్‌లలో 5528 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 100 పరుగులు నాటౌట్. ఐపీఎల్ లో రైనా 1 సెంచరీ, 39 అర్ధ సెంచరీలు చేశాడు.