- ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 2025
- టోర్నీ విజేతగా ఇండియా మాస్టర్స్
- వెస్టిండిస్ మాస్టర్స్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచింది

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 2025 చివరి మ్యాచ్ ఆదివారం ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరిగింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండిస్ మాస్టర్స్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రియాన్ లారా నాయకత్వంలోని వెస్టిండీస్ మాస్టర్స్, 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ మాస్టర్స్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. డ్వేన్ స్మిత్, కెప్టెన్ బ్రియాన్ లారా తొలి వికెట్ కు 23 బంతుల్లో 34 పరుగులు సాధించారు. వినయ్ కుమార్ లారాను అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి చెక్ పెట్టినట్లైంది. కెప్టెన్ లారా 6 బంతుల్లో 6 పరుగులు చేశాడు. దీని తర్వాత వెస్టిండిస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. విలియం పెర్కిన్స్ 7 బంతుల్లో 6 పరుగులు చేశాడు.
ఓపెనర్ డ్వేన్ స్మిత్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4వ స్థానంలో వచ్చిన రవి రాంపాల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 12వ ఓవర్ చివరి బంతికి పవన్ నేగి బౌలింగ్‌లో చాడ్విక్ వాల్టన్ బౌల్డ్ అయ్యాడు. చాడ్విక్ వాల్టన్ 1 సిక్స్ సహాయంతో 6 పరుగులు చేశాడు. దీని తరువాత, లెండిల్ సిమ్మన్స్, దినేష్ రామ్దిన్ ఇన్నింగ్స్ బాధ్యతలను చేపట్టారు. వారిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి ఓవర్లో లెండిల్ సిమ్మన్స్, ఆష్లే నర్స్ (1) అవుట్ అయ్యారు. సిమ్మన్స్ 41 బంతుల్లో 57 పరుగులు చేశాడు. దినేష్ రామ్దిన్ 12 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత్ తరఫున వినయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.
149 పరుగుల లక్ష్యంగా భరిలోకి దిగిన భారత జట్టుకు గొప్ప శుభారంభం లభించింది. పవర్ ప్లే తర్వాత అంబటి రాయుడు, సచిన్ టెండూల్కర్ జట్టు స్కోరును 50 దాటించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 8వ ఓవర్లో సచిన్ టెండూల్కర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. క్రికెట్ గాడ్ 18 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ బాది 25 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 50 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. యూసుఫ్ పఠాన్ ఖాతా కూడా తెరవలేదు. యువరాజ్ సింగ్ 13, స్టూవర్ట్ బిన్నీ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.