Leading News Portal in Telugu

PM Narendra Modi comments on India -Pakistan Cricket Rivalry and also his favorite Player


  • పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
  • భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుతో పాటు క్రీడలపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • తన ఫేవరెట్ ఆటగాడు “డియెగో మారడోనా” అంటూ సమాధానం.
PM Modi: అతనే నా ఫేవరేట్ ప్లేయర్.. బెస్ట్ టీమ్ అదే

PM Modi: తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుతో పాటు క్రీడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసే భారత్, పాక్ మ్యాచ్‌పై స్పందించిన మోడీ.. బెస్ట్ టీమ్‌ను ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఇటీవల టీమిండియా జట్టు అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ – పాకిస్థాన్ జట్లలో ఏది ఉత్తమం? అనే ప్రశ్న ఎదురుకాగానే… ప్రధాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నిజానికి.. తానేమి క్రికెట్ ఎక్స్‌పర్ట్‌ను కాదని, గేమ్ టెక్నికల్ విషయాలు నాకు తెలియవని చెబుతూనే.. కొద్ది రోజుల క్రితం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ ఫలితమే ఏ జట్టు ఉత్తమమో తెలిపిందని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే, క్రీడలకు మాత్రమే ప్రపంచాన్ని ఉత్తేజపరిచే శక్తి ఉందని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా.. వివిధ దేశాల ప్రజలను క్రీడలు ఒక్కటిగా కలిపే సామర్థ్యం కలిగి ఉంటాయని, అందుకే తాను క్రీడలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే భారత్‌ లో ఫుట్‌బాల్‌కు కూడా విపరీతమైన ఆదరణ ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ లోని షాదోల్ అనే జిల్లా గురించి తెలుపుతూ, అక్కడ ఫుట్‌బాల్‌కు ఉన్న ప్రేమ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.

ఆ జిల్లా పూర్తిగా గిరిజనుల ప్రాంతమని, తాను అక్కడికి వెళ్లినప్పుడు చాలా మంది యువకులు, పెద్దవాళ్లు స్పోర్ట్స్ జెర్సీల్లో కనిపించినట్లు తెలిపారు. దానితో వారిని ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, ‘మినీ బ్రెజిల్’ అని సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. అలాగే ఆ ఊరిలో నాలుగు తరాలుగా ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు.. అక్కడి నుంచి 80 మంది జాతీయ స్థాయిలో ఆడినట్లు తెలిపారని వివరించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఫుట్‌బాల్ లెజెండ్స్ గురించి ప్రశ్నించగా, ప్రధాని నరేంద్ర మోడీ తన ఫేవరెట్ ఆటగాడు “డియెగో మారడోనా” అని చెప్పారు. 1980 లలో మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించాడని.. ఆ కాలానికి ఆయనే హీరో అని అన్నారు. కానీ, ఇప్పటి తరం మాత్రం లియోనెల్ మెస్సీ పేరు చెబుతుందని ఆయన పేర్కొన్నారు.