Leading News Portal in Telugu

IPL 2025 Countdown Begins – RCB Welcomes New Captain Rajat Patidar


  • ఐపీఎల్ 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలు
  • మార్చి 22 నుంచి ప్రారంభం
  • సోమవారం ఆర్సీబీ “అన్‌బాక్సింగ్ ఈవెంట్”
  • కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు మద్దతు తెలిపిన కోహ్లీ.
RCB Unbox Event: రజత్ పాటిదార్‌పై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోమవారం నిర్వహించిన “అన్‌బాక్సింగ్ ఈవెంట్” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. జట్టు కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు మద్దతు తెలిపాడు. “రజత్ చాలా కాలం జట్టుకు కెప్టెన్‌గా కొనసాగగలడు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. విజయం సాధించేందుకు అవసరమైన ప్రతిభ అతనికి ఉంది,” అని కోహ్లీ అభిమానులతో చెప్పాడు. గత సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈసారి పాటిదార్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

విరాట్ కోహ్లీ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆర్సీబీ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేకపోయింది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. “ప్రతి సీజన్‌లోనూ కొత్త ఉత్సాహం, ఆనందం ఉంటుంది. నేను 18 ఏళ్లుగా ఈ జట్టుతో ఉన్నాను. ఆర్సీబీ అంటే నాకు ఎంతో ప్రేమ. ఈసారి మన దగ్గర అద్భుతమైన జట్టు ఉంది. ఈ సీజన్‌పై నాకు చాలా ఆశలు ఉన్నాయి,” అని కోహ్లీ అన్నాడు. ఈ ఐపీఎల్ 2025 సీజన్.. టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ ఆడబోయే తొలి టోర్నమెంట్ కావడం విశేషం.

ఈ కార్యక్రమంలో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ, “విరాట్ భాయ్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు ఆర్సీబీ తరఫున ఆడారు. నేను వారి ఆటను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ గొప్ప జట్టుకు కెప్టెన్‌గా అవకాశం రావడం నా జీవితంలో గర్వించదగిన విషయం” అని అన్నాడు. అయితే.. ఆర్సీబీ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే కోహ్లీ మద్దతు, కొత్త కెప్టెన్, జట్టులోని నైపుణ్యం.. ఇవన్నీ కలిపి ఈసారి జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలను పెంచుతాయేమో చూడాలి.