Leading News Portal in Telugu

BCCI to Revise Family Stay Policy for Cricketers


  • క్రికెటర్స్ విదేశీ టూర్‌లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను..,
  • తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం
  • బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్
  • ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.
Virat Kohli: కోహ్లీ వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన బీసీసీఐ..!

బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్‌లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో.. ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ఎక్కువకాలం ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ నుండి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

2025లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవ్వడంతో బీసీసీఐ 10 పాయింట్ల క్రమశిక్షణ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ రుల్స్‌లో ఆటగాళ్లతో వారి కుటుంబాలు విదేశీ పర్యటనలలో ఉండటానికి అనుమతినిచ్చే సమయాన్ని పరిమితం చేశారు. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా పర్యటన తరువాత.. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆంక్షలను తిరిగి అమలు చేయాలని నిర్ణయించారు.

టీమిండియా విదేశీ పర్యటనలో 45 రోజులకు పైగా ఉండే సమయంలో ఆటగాళ్లకు వారి భాగస్వాములు, పిల్లలు (18 సంవత్సరాల లోపు) ఒకసారి, రెండు వారాల పాటు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈ సందర్శన సమయంలో బీసీసీఐ ఆటగాడితో వసతి ఖర్చు భరిస్తుంది. అయితే, ఇతర ఖర్చులు ఆటగాడే భరిస్తారు. కాగా.. బీసీసీఐ ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ” కుటుంబ సభ్యులు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా..? అని ప్రశ్నించాడు. మనకు కఠినమైన పరిస్థితులు వస్తే కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తోంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికీ తప్పనిసరిగా కావాలి.” అని అన్నాడు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను ఏ మాత్రం వదులుకోనని విరాట్ కోహ్లీ చెప్పుకోచ్చాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా మద్దతు ఇచ్చారు. “మీకు కుటుంబం అవసరం, కానీ ఎల్లప్పుడూ ఒక జట్టు కూడా అవసరం. మా కాలంలో, మేము క్రికెట్ బోర్డును ప్రశ్నించకుండా, క్రికెట్ ఆడాలని చెప్పేవాళ్లం.” అని అన్నారు.