Leading News Portal in Telugu

IPL 2025: Robin Uthappa Said IPL is the top T20 league in the world


  • మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం
  • ఐపీఎల్ 2025లో 1000 సిక్స్‌లు పక్కా
  • ప్రపంచంలో ఐపీఎల్ ప్రధాన టీ20 లీగ్‌
IPL 2025: ఐపీఎల్‌ ‘డాడీ’.. 1000 సిక్స్‌లు, 300+ స్కోర్స్ పక్కా!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ‘డాడీ’ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ప్రతీ సీజన్‌ మరింత ఉత్సాహంగా అభిమానులను అలరిస్తోందన్నారు. ఐపీఎల్ 2025లో కచ్చితంగా 1000 సిక్స్‌లు, 300+ స్కోర్లను కూడా చూసే అవకాశం లేకపోలేదని అభిపాయపడ్డాడు. ఐపీఎల్ 18వ సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఉతప్ప అన్నాడు. శనివారం (మార్చి 22) నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది.

‘ఐపీఎల్ రాకతో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆటపై ప్రేమ ఉన్నప్పటికీ.. కొంతమంది కొనసాగించలేకపోతున్నారు. గేమ్ ఇప్పుడు ఉద్వేగభరితంగా మారిపోయింది. అదే సమయంలో అభిమానుల్లో ఉత్సాహంను తీసుకొచ్చింది. ప్రపంచంలో ఐపీఎల్ ప్రధాన టీ20 లీగ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లకు ఐపీఎల్‌ ‘డాడీ’ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌ విజయవంతం కావడానికి ఆవిష్కరణలే ప్రధాన కారణం. గత సీజన్‌ కంటే ఈ సీజన్‌ మరింత ఉత్సాహంగా అభిమానులను అలరించనుంది. ఈ సీజన్‌లో 1000 సిక్స్‌లు నమోదవుతాయి. 300+ స్కోర్లను కూడా చూసే అవకాశం లేకపోలేదు. 275 పరుగులకు పైగా ఛేజింగ్ చేసే జట్టును చూడవచ్చు. డబుల్ హ్యాట్రిక్ లేదా 150 పరుగులు చేసే ఆటగాడిని కూడా మనం చూడవచ్చు’ అని రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చాడు.

2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు సాధించిన జట్టుగా రెండుసార్లు రికార్డు సృష్టించింది. 277/3 స్కోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013లో నెలకొల్పిన 263/5 రికార్డును సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. ఆపై 287/3 స్కోరును నమోదు చేసి మరో రికార్డు నెలకొల్పింది. రికార్డులు ఈజీగా బద్దలవుతున్నందున 2025 ఐపీఎల్‌లో సంచనాలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని రాబిన్ ఉతప్ప అభిపాయపడ్డాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్‌ జట్లకు ఉతప్ప ఆడాడు. 2022లో రిటైర్ అయి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.